విశ్వాస్ టీవీ - ఢిల్లీ / ఉత్తరప్రదేశ్ : మహా కుంభమేళాలో లిక్కర్ స్మగ్లర్.. పుణ్యస్నానం కోసం పోలీసులకు చిక్కాడు! అతడు ఒక లిక్కర్ స్మగ్లర్. కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. ఆ లిక్కర్ స్మగ్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. అతను మాత్రం మహా కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానం చేశాడు. అయితే అక్కడ దొరకడంతో పోలీసులు ఆ లిక్కర్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఏడాదిన్నర క్రితం నకిలీ మద్యం తరలిస్తుండగా పట్టుబడిన ఆ స్మగ్లర్.. అప్పటి నుంచి పరారీలో ఉండగా.. ఇన్ని రోజుల తర్వాత మహా కుంభమేళాలో పట్టుబడటం గమనార్హం. లక్షల మంది భక్తులు నిత్యం స్నానం చేస్తుండగా.. అందులో ఒక 22 ఏళ్ల యువకుడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. మద్యం స్మగ్లింగ్ కేసులో ఏడాదిన్నరగా పరారీలో ఉండి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఆ స్మగ్లర్ ఎట్టకేలకు ప్రయాగ్‌రాజ్‌లో పట్టుబడ్డారు. అతడే రాజస్థాన్‌కు చెందిన ప్రవేశ్ యాదవ్. 22 ఏళ్ల ప్రవేశ్ యాదవ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ఏరియాలో పోలీసులు పట్టుకున్నారు. మద్యం స్మగ్లింగ్ కేసులో 2023 జూలై నుంచి ప్రవేశ్ యాదవ్ తప్పించుకుని తిరుగుతున్నాడని బదోయి ఎస్పీ అభిమన్యు మాంగలిక్ వివరించారు. రాజస్థాన్ అల్వార్ జిల్లాకు చెందిన ప్రవేశ్ యాదవ్.. 2023 జూలై 29వ తేదీన అల్వార్ నుంచి బీహార్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై.. పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తున్న సమయంలో నకిలీ మద్యం పట్టుబడింది. ఆ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ కేసులో ప్రదీప్ యాదవ్, రాజ్ దొమోలియాను అరెస్టు చేశారు. అయితే ప్రవేశ్ యాదవ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీ అయ్యాడు. అల్వార్ జిల్లాకు చెందిన ఈ నిందితులు అందరూ.. చాలా ఏళ్లుగా మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌కు అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానం చేసేందుకు వచ్చిన ప్రవేశ్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు బదోయి ఎస్పీ అభిమన్యు మాంగలిక్ వెల్లడించారు. ఐపీసీతో పాటు ఎక్సైజ్ శాఖ చట్టంలోని 419, 420, 468, 471, 272, 273, 207 సెక్షన్ల కింద ప్రవేశ్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వారు.. పుణ్యస్నానం కోసం ప్రయాగ్‌రాజ్ వస్తే.. చేసిన పాపాలు పండి పోలీసులకు దొరికిపోయాడు అని అంటున్నారు.
Admin
Viswas Tv