విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఏపీలో కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా ఢిల్లీ టూర్లకు వరుసగా వెళ్తుండటం, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు, టీడీపీ మ్యానిఫెస్టో విడుదల నేపథ్యంలో ఈ రూమర్లు మరింత పెరిగాయి. దీనిపై ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు దూకుడుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల ఊహాగానాలన్ని ఆయన ఖండించారు. తాము పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్తామన్నారు. ఇప్పటికే కేంద్రం ఓవైపు జమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తుండటం, ఏపీలోనూ ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తున్నాడన్నారు. చంద్రబాబు ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని ఆరోపించారు. వైసీపీ సింగిల్ గా ఎన్నికల్లో పోటీకి దిగుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి తానేం మాట్లాడనంటూ మీడియాను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు స్పష్టంగానే ఉన్నా రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడితో దీనిపై నమ్మకం కుదరడం లేదు. ముఖ్యంగా కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతుందన్న ప్రచారంతో ముందస్తు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది
Admin
Viswas Tv