విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలా ఓ విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంటుంది. గతంలో 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం పేరుతో బీజేపీ ఏపీలో తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది ఈ క్రమంలో అధికార పార్టీల్ని అవినీతి పేరుతో టార్గెట్ చేస్తున్న బీజేపీ.. ఈసారి కూడా 2024 ఎన్నికలకు ముందే అధికార వైసీపీని అదే పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టేసింది.
తాజాగా శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రంలో కీలకంగా ఉన్న హోమంత్రి అమిత్ షా విశాఖలో తాజాగా పర్యటించారు. ఈ రెండు సభల్లోనూ నడ్డా, అమిత్ షా కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. దాని కంటే స్ధానికంగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ను, సీఎం జగన్ ను టార్గెట్ చేసేందుకు ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా వైసీపీ అవినీతి తమకు ఇప్పుడే గుర్తుకొచ్చిందనేలా విమర్శలు చేశారు.
గతంలో చంద్రబాబుతో మూడున్నరేళ్లు కాపురం చేసిన బీజేపీ.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తమతో విభేదించారన్న కారణంతో ఆయన్ను తీవ్రంగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా కీలకమైన ఎన్నికల సమయంలో ఆర్ధిక వెసులుబాటు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఓవైపు రాజకీయ విమర్శలు చేస్తూనే మరోవైపు ఆర్ధికంగానూ చంద్రబాబు టీడీపీని దిగ్బంధించింది. దీంతో 2019 ఎన్నికల్లో చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లకు టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు వైఎస్ జగన్ పైనా ముందుగా అవినీతి పేరుతో బీజేపీ కీలక నేతలు నడ్డా, అమిత్ షా విమర్శలకు దిగడంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగేళ్లుగా దూరంగా ఉంచిన చంద్రబాబును ఢిల్లీకి రప్పించుకుని చర్చించిన అమిత్ షా .. విశాఖలో జగన్ సర్కార్ పై చేసిన విమర్శలు చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి ఏం జరగబోతోందో ఇట్టే అర్ధమవుతుంది. దీంతో బీజేపీ రాజకీయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ఇవ్వాల్సిన విభజన హామీల్ని నెరవేర్చకుండా రాష్ట్రంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల్ని అవినీతి పేరుతో టార్గెట్ చేయడం ద్వారా ఆత్మరక్షణలోకి నెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Admin
Viswas Tv