విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి : దేవరాపల్లి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,స్థానిక ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఇసుకను వారి ఆధీనంలో పెట్టుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నారని మాజీమంత్రి, టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. వైసిపి ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని కలిగొట్ల శారదా నది వంతెన సమీపంలోని ఇసుక రీచ్లు వద్ద సోమవారం టిడిపి శ్రేణులు ఇసుక సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాడుగుల టిడిపి ఇన్చార్జి పి వి జి కుమార్ అధ్యక్షతన,మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యoలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బండారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసిపి ఇసుక దోపిడీని అధికారి యంత్రాంగం ఆపలేకపోతే, టిడిపి కార్యకర్తలు మూకుమ్మడిగా దాడులు చేసి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటుందన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భవనాలకు, పేదల గృహ నిర్మాణాలకు ఉచితంగా ఇసుక ఇచ్చిన పర్వాలేదు కానీ, ఆ ముసుగులో దోపిడీ చేసి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారని అన్నారు. దీనివలన భూగర్భ జలాలు అడుగంటి పోవడమే కాకుండా శారదా నది సమీపంలో ఉన్న ఇటు వంతెన, అటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించకపోతే పట్టి పట్టనట్లు వ్యవహరించిన స్థానిక తహసీల్దార్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఇసుక అక్రమ రవాణా పై సిఐడి, సిబిఐ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అక్కడ కంకర, ఇక్కడ ఇసుక తింటున్నారని దుయ్యబట్టారు.విశాఖ అర్బన్ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి ఇసుక దోపిడీదారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రోజుకి 100 ట్రాక్టర్లతో ఇక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక దోపిడీ చేయడం వలన ఇసుక మాఫియా వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తుందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారా రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, కోళ్ల లలితా కుమారి, గిడ్డి ఈశ్వరి, భీమిలి, చోడవరం నియోజకవర్గం ఇన్చార్జీలు కోరాడ రాజబాబు, బత్తుల తాతయ్య బాబు, మాడుగుల పరిశీలకులు కృష్ణ, పైలా ప్రసాదరావు, కృష్ణ యాదవ్, సత్యవతి, స్థానిక టిడిపి నాయకులు పోతల పాత్రు నాయుడు, చరకాన సూర్యనారాయణ,దొగ్గ దేముడు నాయుడు బండారు రామారావు,చల్లా నానాజీ, నియోజకవర్గం నలుమూలల నుంచి టిడిపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Viswas Tv