విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : STORY BEHIND NEPAL FLASH FLOODS AND ITS CONSEQUENCES నేపాల్ జలప్రళయం.. ప్రపంచానికి ప్రకృతి ఇచ్చిన వార్నింగ్ ! భూమి మండితే.. మంచు కొండలు విరిగితే.. మనిషి నాగరికత ఎంత నిస్సహాయమో చూపించిన హిమాలయ విలయం ఇది. ఒక్కసారిగా కొండ విరిగిపడింది... మంచు, రాళ్లు, బురద.. కోట్ల లీటర్ల నీరు ఒకేసారి లోయల్లోకి దూసుకొచ్చింది... ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది.. క్షణాల్లో ప్రళయ ప్రవాహంగా మారిపోయింది... బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి... రోడ్లు మాయమయ్యాయి... ఇళ్లు నేలమట్టమయ్యాయి... ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు... హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమాలో కనిపించే విధ్వంసం... ఈ సారి నిజ జీవితంలో కనిపించింది... ఇది సినిమా కాదు... ఇది నేపాల్‌లో జరిగిన ప్రకృతి విలయతాండవం! ............................................ అసలు మనం నేపాల్‌ను చూసి ప్రపంచం ఏం నేర్చుకోవాలి ? ప్రకృతిని జయించామని మనిషి అనుకోవచ్చు... కానీ ప్రకృతి ఒక్కసారి తిరగబడితే నాగరికత ఎంత చిన్నదో నేపాల్ చూపించింది. హిమాలయాల్లో జరుగుతున్న మార్పులు కేవలం నేపాల్ సమస్య కాదు. ఇది భారత్‌తో పాటు మొత్తం దక్షిణాసియాకు ఒక భారీ హెచ్చరిక. ప్రశ్న ఒక్కటే... నేపాల్‌లో జరిగిన విపత్తు నుంచి ప్రపంచ దేశాలు పాఠం నేర్చుకుంటాయా ? లేక...మరో విపత్తు వచ్చిన తర్వాతే మేల్కొంటాయా ? అసలు నేపాల్‌లో ఏం జరిగింది ? నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతం... ఎత్తైన హిమాలయ పర్వతాలు... వేల అడుగుల ఎత్తులో మంచు, రాళ్లతో కూడిన భారీ భాగం అస్థిరంగా మారడం... అకస్మాత్తుగా విరిగిపడటం... ఆ తర్వాత జరిగిన పరిణామాలు అత్యంత భయానకంగా మారాయి. మంచు,రాళ్లు,మట్టి, నీరు... ఇలా అన్నీ కలిసి ఒక భారీ ప్రవాహంగా లోయల్లోకి దూసుకొచ్చాయి. చిన్న నది ఒక్కసారిగా రాక్షస ప్రవాహంగా మారింది. దాని దారిలో వచ్చిన...గ్రామాలు,రహదారులు, వంతెనలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, వాహనాలు పర్యాటక ప్రాంతాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. .............................. నేపాల్ ను కకావికలం చేసిన ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటి...? సాధారణ వరదకు ముందు కొంత సమయం ఉంటుంది. వర్షాలు పడతాయి... నదులు నిండుతాయి... నీటి మట్టం పెరుగుతుంది... కానీ ఫ్లాష్ ఫ్లడ్ వేరు! హెచ్చరికకు సమయం ఇవ్వదు... కొండ ప్రాంతాల్లో... క్లౌడ్ బరస్ట్, హిమనద సరస్సు తెగిపోవడం, భారీ ల్యాండ్‌స్లైడ్, ఐస్-రాక్ అవలాంచ్ లాంటి ఘటనలు జరిగితే... నీరు, మట్టి, రాళ్లు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలపై విరుచుకుపడతాయి. అదే ఫ్లాష్ ఫ్లడ్ విధ్వంసం. నేపాల్ లో వచ్చిన విపత్తును సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. నీటితో నిండిన బకెట్‌లోకి... ఒక్కసారిగా భారీ రాయిని వేస్తే ఏమవుతుంది? నీరు బయటకు ఎగిసిపడుతుంది. అదే విధంగా... ఎత్తైన పర్వత ప్రాంతంలో భారీ మంచు-రాతి భాగం విరిగి లోయలోకి పడితే... అక్కడ ఉన్న నీరు ఒక్కసారిగా భారీ ప్రవాహంగా మారే అవకాశం ఉంటుంది. కానీ హిమాలయాల్లో ఇది కేవలం నీరు కాదు... దానితో పాటు... మంచు,బండరాళ్లు,చెట్లు,మట్టి, శిథిలాలు ఇలా అన్నీ కలిసి ఒక విధ్వంసకర ప్రవాహంగా మారతాయి. విపత్తుపై శాటిలైట్ చిత్రాలు ఏం చెబుతున్నాయి అంటే....నిజానికి ఇలాంటి విపత్తుల్లో శాటిలైట్ చిత్రాలు అత్యంత కీలకం. ఎందుకంటే... మనిషి చేరలేని వేల అడుగుల ఎత్తులో ఏం జరిగిందో... అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలు చెప్పగలవు. ఈ చిత్రాల ద్వారా శాస్త్రవేత్తలు ఏం పరిశీలిస్తారంటే హిమనదాల పరిమాణంలో మార్పు, కొత్తగా ఏర్పడుతున్న సరస్సులు, మంచు కరిగే వేగం, పర్వతాలపై పగుళ్లు, రాక్ ఫాల్ జోన్లు, నదుల ప్రవాహ మార్పులు. తాజా విపత్తు తర్వాత కూడా శాటిలైట్ చిత్రాల ద్వారా కొత్తగా ఏర్పడిన నీటి నిల్వలు, భవిష్యత్తులో మరో వరద ప్రమాదం ఉండే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అంటే విపత్తు ముగిసిందని అనుకున్నా... ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేని పరిస్థితి. హిమాలయాలు ఎందుకు అస్థిరంగా మారుతున్నాయి ? ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద ప్రశ్న. భూమి ఎందుకు మండిపోతోంది ? దానికి ప్రధాన కారణాల్లో ఒకటి... గ్లోబల్ వార్మింగ్. పారిశ్రామిక విప్లవం తర్వాత... బొగ్గు వినియోగం పెట్రోల్, డీజిల్ వినియోగం భారీ పరిశ్రమలు అడవుల నరికివేత కాలుష్యం అధిక కార్బన్ ఉద్గారాలు....వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను పెంచాయి. దీంతో భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూమి వేడెక్కుతోంది... సముద్రాలు వేడెక్కుతున్నాయి... హిమనదాలు కరుగుతున్నాయి... పర్వతాల నిర్మాణం అస్థిరంగా మారుతోంది. హిమాలయాల్లో అసలు ప్రమాదం ఏంటి ? హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరగడం అంటే... కేవలం మంచు కరగడం మాత్రమే కాదు. దాని ప్రభావం చాలా పెద్దది. ఉష్ణోగ్రత పెరిగితే... హిమనదాలు కరుగుతాయి కొత్త గ్లేషియర్ సరస్సులు ఏర్పడతాయి మంచు కింద ఉన్న నేల బలహీనపడుతుంది పర్వత రాళ్ల మధ్య ఉన్న మంచు కరుగుతుంది కొండచరియలు అస్థిరంగా మారతాయి భారీ ల్యాండ్‌స్లైడ్లకు అవకాశం పెరుగుతుంది అంటే...భూమి వేడెక్కడం వల్ల పర్వతాలు కూడా బలహీనపడుతున్నాయి. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా ? మన చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ వచ్చాం... ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం! అది నిజమే. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో విషయం చెబుతున్నారు. ప్రతి విపత్తుకు...కేవలం ప్రకృతిని మాత్రమే నిందించలేం. ఎందుకంటే...మనిషి చర్యలు కూడా ప్రకృతి ప్రమాదాలను మరింత తీవ్రంగా మార్చుతున్నాయి. ఉదాహరణకు... విచక్షణారహిత అడవుల నరికివేత కొండలను పేల్చి రోడ్ల నిర్మాణం సున్నితమైన ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు శాస్త్రీయ అధ్యయనం లేకుండా పవర్ ప్రాజెక్టులు పర్యాటక ఒత్తిడి అధిక కార్బన్ ఉద్గారాలు ఇవన్నీ కలిసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. పాలకులు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ? నేపాల్ విపత్తు ప్రభుత్వాలకు ఒక పెద్ద ప్రశ్న వేస్తోంది. అభివృద్ధి కావాలా ? ప్రకృతి పరిరక్షణ కావాలా? అసలు ప్రశ్న అది కాదు. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి ఎలా చేయాలి ? అదే అసలు సవాల్. కొండ ప్రాంతాల్లో... ఎక్కడ నిర్మాణాలు చేయాలి ? ఎక్కడ చేయకూడదు ? ఎన్ని హైడ్రో ప్రాజెక్టులు అవసరం ? ఏ ప్రాంతాలు ప్రమాదకరమైనవి ? ఎంత జనాభాను అనుమతించాలి ? అనే అంశాలపై శాస్త్రీయ ప్రణాళిక అవసరం. నేపాల్ లో వరద విపత్తు నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అనేదానిపై ఆసక్తి నెలకొనింది. నేపాల్ విపత్తు తర్వాత ప్రపంచం తీసుకోవాల్సిన ప్రధాన నిర్ణయాలు ఇవే... 1. గ్లేషియర్ మానిటరింగ్ అంటే హిమనదాలను నిరంతరం శాటిలైట్ల ద్వారా పరిశీలించాలి. 2. గ్లేషియర్ సరస్సుల మ్యాపింగ్ అంటే ప్రమాదకర సరస్సులను గుర్తించాలి. 3. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే కొండ ప్రాంతాల నుంచి దిగువ గ్రామాలకు క్షణాల్లో హెచ్చరికలు వెళ్లాలి. 4. ప్రమాదకర ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణ అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా నిర్మాణాలు నిలిపివేయాలి. 5. అంతర్జాతీయ సమాచారం పంచుకోవడం...అంటే హిమాలయాలు అనేక దేశాలకు సంబంధించినవి. ఒక దేశంలో జరిగిన మార్పు... మరో దేశంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి... భారత్,నేపాల్,చైనా,భూటాన్,పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల మధ్య పర్యావరణ సమాచార మార్పిడి అత్యవసరం. భారత్ నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏంటంటే.... నేపాల్ మనకు దూరంగా లేదు. హిమాలయాలే భారత్‌కు ఉత్తర రక్షణ కవచం. కానీ...అదే హిమాలయాల్లో అస్థిరత పెరిగితే... దాని ప్రభావం భారతదేశంపైనా ఉంటుంది. మన దేశంలో కూడా... ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలకు అత్యంత సున్నితమైనవి. గతంలో...ఉత్తరాఖండ్ విపత్తు... సిక్కిం గ్లేషియర్ సరస్సు వరద... హిమాచల్‌లో కొండచరియలు... అస్సాంలో భారీ వరదలు... మనకు ఇప్పటికే చాలా హెచ్చరికలు ఇచ్చాయి. ఇప్పుడు నేపాల్ మరో అలారం మోగించింది. అస్సాం నుంచి నేపాల్ వరకు... ఒకే హెచ్చరిక ! మొన్న అస్సాం... నిన్న హిమాలయ ప్రాంతాలు... ఈ రోజు నేపాల్... ప్రపంచవ్యాప్తంగా... రికార్డు ఉష్ణోగ్రతలు,భారీ వర్షాలు,ఆకస్మిక వరదలు,అడవి మంటలు, మంచు కరుగుదల పెరుగుతున్నాయి. ఇవి వేర్వేరు ఘటనలు కావచ్చు... కానీ వాటి వెనుక ఉన్న పెద్ద ప్రశ్న ఒక్కటే. భూమి వాతావరణ వ్యవస్థ మారుతోందా ? శాస్త్రవేత్తల హెచ్చరిక కూడా ఇదే. వాతావరణ మార్పు కారణంగా తీవ్ర వాతావరణ ఘటనలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. నేపాల్ లో జరిగింది “ఇన్‌ల్యాండ్ సునామీ” లాంటి విధ్వంసం అనుకోవచ్చు. సునామీ అంటే మనకు గుర్తుకు వచ్చేది సముద్రం. కానీ కొండ ప్రాంతాల్లో కూడా... అత్యంత భారీ స్థాయిలో నీరు, మట్టి, రాళ్లు ఒక్కసారిగా లోయల్లోకి దూసుకెళ్తే... దాని విధ్వంసం సునామీని తలపిస్తుంది. నదులు తమ సహజ ప్రవాహాన్ని కోల్పోతాయి. నీటి వేగం పెరుగుతుంది. భారీ బండరాళ్లు కూడా బొమ్మల్లా కొట్టుకుపోతాయి. ఇళ్లకు పునాదులు ఉండవు. బ్రిడ్జిలు క్షణాల్లో కూలిపోతాయి. మనిషికి స్పందించడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఫ్లాష్ ఫ్లడ్ అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటి. కైలాస్ మానసరోవర్ యాత్రికులపై విపత్తు ప్రభావం పడింది. నేపాల్‌లోని రసువా ప్రాంతం... కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లే అనేక పర్యాటకులు, యాత్రికులు ఉపయోగించే కీలక మార్గాల్లో ఒకటి. ఈ మార్గంలో... భారతీయ యాత్రికులు,విదేశీ పర్యాటకులు,ట్రెక్కర్లు ఉండటంతో విపత్తు ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరింది. చాలా మంది యాత్రికుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. భారత్, నేపాల్‌తో పాటు ఇతర దేశాల అధికారులు కూడా తమ పౌరుల వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేపాల్ దుర్ఘటన జరిగిన తర్వాత ప్రకృతి ముందు మనిషి చాలా చిన్నవాడు అని అనిపిస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ ఉంది... శాటిలైట్లు ఉన్నాయి... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది... అత్యాధునిక కమ్యూనికేషన్ ఉంది... కానీ...వేల అడుగుల ఎత్తులో ఒక పర్వతం విరిగిపడి... కోట్ల టన్నుల మంచు, రాళ్లు లోయల్లోకి దూసుకొస్తే... మనిషి ఎంత నిస్సహాయుడో నేపాల్ చూపించింది. సీసీ కెమెరాల్లో కనిపించిన ప్రజల పరుగులు... కొట్టుకుపోతున్న వాహనాలు... కూలిపోతున్న బ్రిడ్జిలు... బురదలో కూరుకుపోయిన గ్రామాలు... ఇవి కేవలం విజువల్స్ కాదు... భవిష్యత్తుకు ప్రకృతి పంపిన హెచ్చరికలు. విపత్తులకు కారణమవుతున్న వాటిలో ఒకటి గ్లోబల్ వార్మింగ్....అంటే భూమి వేడెక్కడం. ఇంతుకు భూమిని మండిస్తున్నది ఎవరు ? భూమి ఎందుకు మండిపోతోంది ? ఎవరి వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ? ఎవరి అభివృద్ధి కోసం అడవులు నరికేస్తున్నాం ? ఎవరి లాభాల కోసం కొండలను పేల్చేస్తున్నాం ? ఎవరి వ్యాపారాల కోసం నదులను మార్చేస్తున్నాం ? ఎవరి సౌకర్యాల కోసం ప్రకృతి సమతుల్యతను పణంగా పెడుతున్నాం ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది... కేవలం ప్రభుత్వాలు కాదు... కేవలం పారిశ్రామికవేత్తలు కాదు... మనం అందరం! ఎందుకంటే... కాలుష్యానికి సరిహద్దులు లేవు... గ్లోబల్ వార్మింగ్‌కు దేశాల మధ్య గీతలు లేవు... హిమాలయాల్లో మంచు కరిగితే... దాని ప్రభావం ఒక్క దేశానికే పరిమితం కాదు. నేపాల్‌లో జరిగినది కేవలం ఒక దేశానికి చెందిన విషాదం కాదు... అది ప్రపంచానికి వచ్చిన వార్నింగ్. మొన్న అస్సాం చూసాం... గతంలో ఉత్తరాఖండ్ చూసాం... సిక్కిం చూసాం... హిమాచల్ చూసాం... ఇప్పుడు నేపాల్ చూస్తున్నాం... ప్రతి విపత్తు తర్వాత... ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదు” అంటాం. కానీ... జరగకముందే నేర్చుకుంటున్నామా ? అదే అసలు ప్రశ్న ! ప్రకృతిని జయించడానికి ప్రయత్నిస్తే... ప్రకృతి ఒక్కరోజు తన శక్తిని చూపిస్తుంది! ప్రకృతితో కలిసి జీవిస్తేనే... రాబోయే తరాలకు భద్రమైన భూమిని అందించగలం! నేపాల్ జలప్రళయం మనకు చెప్పేది ఒక్కటే... “ఇప్పటికైనా మేలుకోండి...” “భూమిని కాపాడండి...” “లేకపోతే రేపటి విపత్తు మన గుమ్మం దగ్గరే ఉండొచ్చు...! ......................................
Admin
Viswas Tv