విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లా : *పోలీసుల వైఖరిపై బాధితురాలి ఆగ్రహం: ముందస్తు సమాచారం లేకుండానే అక్రమ అరెస్ట్..!* - రాత్రికి రాత్రే అదృశ్యం.. ఉదయాన్నే కోర్టుకు రిమాండ్: రేణుక ఆవేదన..! - రాత్రి 10:00 గం:లకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు పోలీసులకు ఫోన్ చేసినా స్పందించని పరిస్థితి.. - చట్ట వ్యతిరేక చర్యలపై లీగల్ పోరాటం: ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి MN ప్రసాద్ గారు ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించకుండా రాత్రికి రాత్రే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత అరెస్ట్ చూపించడంపై నన్నపనేని వెంకటరావు గారి భార్య రేణుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేణుక తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5:00 గం:లకు సమయంలో వెంకటరావు బయటకు వెళ్లారు. రాత్రి 7:00 గం:లకు తిరిగి వస్తానని చెప్పినప్పటికీ ఆయన ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా, పదే పదే కాల్ కట్ చేస్తూ వచ్చారు. చుట్టుపక్కల వారిని విచారించగా, రాత్రి 10 గంటల సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి ఆయనను తీసుకెళ్లారని సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు రాత్రి 11:00 గంటలకు వినుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే స్టేషన్‌లో ఉన్న సిబ్బంది ఫిర్యాదు తీసుకోకపోగా, తమ వద్ద ఎవరూ లేరని సమాధానమిచ్చారు. అర్ధరాత్రి 1:00 గంట వరకు స్టేషన్ వద్దే వేచి చూసినా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 'డయల్ 100'కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ, "ఇప్పుడు తీసుకోలేము, శనివారం ఉదయం రండి" అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. "రాత్రి 7 గంటల నుంచి ఆయన కనిపించకుండా పోతే, ఉదయం 2 గంటలకో ఏమో అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇదెక్కడి న్యాయం? కనీసం కలవనివ్వకుండా నేరుగా కోర్టుకే పంపుతున్నారు" అని రేణుక పేర్కొన్నారు. శనివారం ఉదయం స్టేషన్‌కు వెళ్లగా, సీఐ పిలిపించి "మీ వారిని ఇప్పుడే అరెస్ట్ చేశాం" అని తెలిపారని వెల్లడించారు. గతరాత్రి 7 గంటల నుండి ఆచూకీ లేని వ్యక్తిని, రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసినట్లు రికార్డుల్లో చూపించడం ఏంటని ప్రశ్నించగా, పోలీసులు సరైన సమాధానం చెప్పలేదన్నారు. కేవలం అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తన వద్ద నుంచి సంతకం మాత్రమే తీసుకున్నారని, తన భర్తను కలవడానికి కూడా అనుమతించలేదని ఆవేదన చెందారు. "నేరుగా కోర్టులోనే చూసుకోండి, కోర్టుకు తరలించాం" అని అధికారులు చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి MN ప్రసాద్ గారు తీవ్రంగా స్పందిస్తూ, శుక్రవారం సాయంత్రం వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు సన్నపనేని వెంకటరావు చౌదరిని పోలీసులు అక్రమంగా తీసుకొచ్చి నిర్బంధించారని విమర్శించారు. శుక్రవారం 7 గంటలకు ఎవరు తీసుకెళ్లారో తెలియక ఆ కుటుంబం భయాందోళన చెందిందని, పోలీసులే అరెస్ట్ చేశారా లేదా ప్రైవేట్ వ్యక్తులు ఏమైనా కిడ్నాప్ చేశారా అనే అయోమయంలో గడిపారని పేర్కొన్నారు. రాత్రి 11 గంటలకు భార్య రేణుక స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చూసినా పోలీసులు నిరాకరించారని, అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా ధృవీకరించలేదని తెలిపారు. ఉదయం నుంచి కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తెచ్చిన తర్వాతే అరెస్ట్ చేసినట్లు ఒప్పుకుని, ఉదయం 10 గంటల సమయంలో ఇంటిమేషన్ నోటీసుపై సంతకం తీసుకున్నారన్నారు. "ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలంటే ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అర్ధరాత్రి పూట వచ్చి తీసుకెళ్లడానికి వెంకటరావు చౌదరి ఏ డకాయిట్, బందిపోటు దొంగ లేదా దేశద్రోహి కాదు. ఆయనొక సోషల్ మీడియా కార్యకర్త, వ్యాపారస్తుడు" అని స్పష్టం చేశారు. న్యాయవాదిగా, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వ్యక్తి ఎలా ఉన్నారో, ఏ విషయంపై అరెస్ట్ చేశారో వివరాలు అడిగితే ఎలాంటి సమాచారం చెప్పకుండా "మా కస్టడీలో ఉన్నారు" అని మాత్రమే సమాధానం చెప్పారని ఎం. ఎన్. ప్రసాద్ మండిపడ్డారు. ఇది హిట్లర్ లాంటి పరిపాలన అని, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడా లేవని అన్నారు. చంద్రబాబు నాయుడు, స్థానిక ఆంజనేయులు, లోకేష్ బాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. యాక్టివ్‌గా ఉండే నాయకులపై సోషల్ మీడియా కేసులే కాకుండా పాత తగాదాలను త్రవ్వి తీసి తప్పుడు అటెంప్ట్ టు మర్డర్, రేప్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఒక ఆనవాయితీగా మార్చారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను కూటమికి ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌గా, పోలీస్ స్టేషన్లను తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లా మార్చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరూ ఈ దుర్మార్గాలకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి దుర్మార్గాన్ని పార్లమెంటరీ భాషలోనే విమర్శించాలని MN ప్రసాద్ గారు పిలుపునిచ్చారు. కూటమి నాయకులు అన్ పార్లమెంటరీ భాష మాట్లాడిస్తూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినా, మన వైస్సార్సీపీ కార్యకర్తలు ఓపిక పట్టి పార్లమెంటరీ పరిధిలోనే స్పందించాలని సూచించారు. రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం తప్పుడు కేసులు పెట్టిన వారిని, దుర్మార్గంగా వ్యవహరించిన వారిని కోర్టు ముందు నిలబెట్టి శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ అక్రమ అరెస్ట్‌పై లీగల్‌గా, కోర్టు ద్వారా పోరాడతామని ఆయన తెలియజేశారు.
Admin
Viswas Tv