విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : గెడ్డ పోరంబోకుపై నిర్మాణాలా ? సర్వే నెం.57లో బాహాటపు కబ్జా... అధికారుల మౌనం పై అనుమానాలు ! గోపాలపట్నం, జూలై 31 ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఉన్న రెవెన్యూ చట్టాలు 92వ వార్డు వెంకటాపురంలో గాలికొదిలేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే నెం.57లోని స్థలం ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ‘గెడ్డ పోరంబోకు’గా నమోదై ఉంది. అయినప్పటికీ అక్కడ రోడ్డును ఆక్రమిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా స్లాబ్ పరిమితి పెంపు, పై అంతస్తుల కోసం కాలమ్స్ వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరికి కఠినం... మరొకరికి సడలింపా ? ఇదే ప్రాంతంలో గతంలో సామాన్యులు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తే ‘గెడ్డ బంజరు కలిసింది’ అంటూ అడ్డుకున్నారు. అదే అధికార యంత్రాంగం, ఇప్పుడు రికార్డుల్లోనే వాగుగా ఉన్న స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములకు క్షేత్రస్థాయిలో బాధ్యత వహించాల్సిన వీఆర్వో సుబ్రహ్మణ్యం వ్యవహారశైలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల ఆవేదన “మేము ప్రభుత్వ స్థలం ఆక్రమించలేదు. కష్టపడి కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకుంటే అడ్డుకుంటారు. మరి ఇక్కడ వాగును కబ్జా చేస్తూ భవనాలు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? డబ్బు, పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా?” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమాల వెనుక దళారులు, కొందరు నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణ చర్యలు కోరుతున్న ప్రజలు సర్వే నెం.57లోని గెడ్డ పోరంబోకు ఆక్రమణలను వెంటనే నిలిపివేయాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ఇటువంటి ఆక్రమణలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Admin
Viswas Tv