విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలపై రాజకీయ దుమారం మరింత ముదురుతోంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు 26 నెలల బకాయి నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాడుగుల నియోజకవర్గంలో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం తారువ గ్రామంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు క్యాంపు కార్యాలయంలో మాడుగుల నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. దేవరాపల్లి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూరె బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లే అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన బూడి ముత్యాల నాయుడు... రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్రంగా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న ఆయన... ఎన్నికల హామీల మేరకు 26 నెలలుగా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆగస్టు 6, 7, 8, 9 తేదీల్లో నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతతో కలిసి రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు, నిరుద్యోగం, నియామకాలలో జరిగిన అన్యాయాలపై ప్రజల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని బూడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు
Admin
Viswas Tv