విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ డైరీ అక్రమాలుపై శాసనసభ కమిటీ నిగ్గు తేల్చాలి!! ఉత్తరాంధ్ర పాల రైతుల ప్రయోజనాల కోసం ఏర్పడిన విశాఖ డైరీ వ్యవహారాలపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాల రైతుల నుంచి సేకరించిన పాలతో వచ్చిన ఆదాయంతో ఇతర జిల్లాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారా? ప్రైవేటు డైరీకి పాలు విక్రయించిన వ్యవహారంలో కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు వచ్చాయి? డైరీకి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి ? మేనేజింగ్ డైరెక్టర్ వేతనం విషయంలో ఇంత భారీ మొత్తం ఎలా నిర్ణయించారు ? డైరీకి సంబంధించిన వ్యవహారాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ నివేదిక ఇంతకాలం ఎందుకు బయటకు రాలేదు? పాల రైతుల సొమ్ముకు బాధ్యత ఎవరిది ? ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల పాల ఉత్పత్తిదారుల నుంచి సేకరించిన పాల ద్వారా వచ్చిన ఆదాయంతో చిత్తూరు జిల్లాలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడ సేకరించిన పాలను ఒక ప్రైవేటు డైరీకి విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే... ఆ ప్రైవేటు డైరీ నుంచి సుమారు రూ.5 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ బకాయిలు ఎంత? డబ్బు ఎందుకు నిలిచిపోయింది? ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నది ఎవరు? బకాయిల వసూలుకు ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు? అంతకంటే ముఖ్యంగా... పాల రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన డైరీకి ఈ ఆర్థిక నష్టానికి బాధ్యత ఎవరిది ? ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. అక్కడి పాల రైతులకు ఇవ్వలేని ధరను చిత్తూరు జిల్లాలోని పాల సేకరణ కేంద్రాల్లో లీటరుకు సుమారు 5 రూపాయలు ఎక్కువగా ఎందుకు చెల్లించారనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి ? దీనిపై విశాఖ డైరీ యాజమాన్యం, అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ? ఇవే ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఎండీ వేతనం నిర్ణయించిన ప్రాతిపదిక ఏమిటి ? విశాఖ డైరీ మేనేజింగ్ డైరెక్టర్‌కు నెలకు సుమారు 12 లక్షల వేతనం చెల్లిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వేతనాన్ని ఎవరు నిర్ణయించారు ? డైరీ బోర్డు ఏ ప్రాతిపదికన ఆ మొత్తాన్ని ఆమోదించింది ? ఎండీ వేతనం నిర్ణయించడానికి అనుసరించిన నిబంధనలు ఏమిటి ? దేశంలో భారీ స్థాయి టర్నోవర్ కలిగిన సహకార డైరీల ఉన్నతాధికారుల వేతనాలతో పోలిస్తే ఈ మొత్తం ఎలా సమర్థించబడుతుంది ? విశాఖ డైరీ బోర్డు దీనిపై అధికారికంగా స్పష్టత ఇస్తుందా ? ఇలా ఎన్నో సందేహాలు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని డైరీ వ్యవహారం ఏమిటి ? విశాఖ డైరీ చైర్మన్‌కు సంబంధం ఉన్న డైరీకి హైదరాబాద్‌లో స్థలం లేదా ఆస్తిని అద్దెకు ఇచ్చి కోట్ల రూపాయల మేర ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆ ఆస్తి ఎవరి పేరుపై ఉంది ? విశాఖ డైరీకి దానితో ఉన్న సంబంధం ఏమిటి ? అద్దె ఒప్పందం ఉందా ? ఎంత అద్దె చెల్లిస్తున్నారు ? ఆ ఆదాయం డైరీ ఖాతాల్లో ఏ విధంగా చూపించారు ? లీటర్ పాల ధర 44 రూపాయలకు విక్రయిస్తున్నారనే ప్రచారం వాస్తవమా ? అయితే పాల రైతుల నుంచి కొనుగోలు ధర, వినియోగదారుడికి విక్రయ ధర మధ్య ఉన్న తేడా ఎంత ? శాసనసభ కమిటీ నివేదిక ఎక్కడ ? విశాఖ డైరీలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై 2024 అక్టోబర్‌లో కూటమి ప్రభుత్వం శాసనసభ కమిటీని ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. కమిటీ ఏర్పాటై ఇంతకాలం గడిచినా... ఆ కమిటీ నివేదిక ఎందుకు బయటకు రాలేదు ? కమిటీ ఏ అంశాలపై విచారణ చేసింది ? ఎవరెవరిని ప్రశ్నించింది ? ఎలాంటి పత్రాలను పరిశీలించింది ? నివేదిక సిద్ధమైందా ? సిద్ధమైతే ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు ? నివేదికలో ఏముందో ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా? వీటన్నింటికీ సమాధానాలు ఇవ్వాలి. రాజకీయ పార్టీల మౌనం ఎందుకు ? విశాఖ డైరీ వ్యవహారంపై ఆరోపణలు ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఎందుకు పెద్దగా ప్రస్తావించడం లేదు ? కమిటీ నివేదికను బయటపెట్టాలని ప్రతిపక్షాలు ఎందుకు బలంగా డిమాండ్ చేయడం లేదు? అధికార పార్టీ కూడా పూర్తి వివరాలను ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదు? ఇది కేవలం రాజకీయ అంశమా? లేక వేలాది పాల రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారమా? ప్రశ్నలు అడిగితే సమాధానాలు రావాలి. ఆరోపణలు నిజం కాకపోతే అధికారిక లెక్కలతో ఖండించాలి. అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. విశాఖ డైరీ ఎవరిది ? అది పాల రైతులదా ? లేక కొందరి ప్రయోజనాల కోసమే నడుస్తోందా ? పాల రైతుల నుంచి సేకరించిన పాలకు సంబంధించిన ప్రతి రూపాయి లెక్క బయటకు రావాలి. ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన పాలు... వచ్చిన బకాయిలు... ఎండీ వేతనం... హైదరాబాద్ ఆస్తుల వ్యవహారం... శాసనసభ కమిటీ నివేదిక... ప్రతి అంశంపై ప్రభుత్వం, విశాఖ డైరీ యాజమాన్యం స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే...ఇది కేవలం ఒక డైరీ వ్యవహారం కాదు. వేలాది పాల రైతుల చెమటతో ముడిపడిన ప్రజా ధనం వ్యవహారం. సమాధానం చెప్పాల్సిందే... లెక్కలు చూపాల్సిందే... నిజాలు బయటపెట్టాల్సిందే. .........................
Admin
Viswas Tv